'దేవుడు కోరికని బట్టి కాదు ... అర్హతని బట్టి ఇస్తాడు.. పరమాత్మ అనుగ్రహం పొందడానికి అర్హతలు ఉన్నాయి. ఇది భగవద్గీత లో కృష్ణుడు -11 వ అధ్యాయమైన విశ్వరూపసందర్శన యోగం లో, 55 వ శ్లోకం లో అర్జునుడి కి చెబుతూ -" ఓ అర్జునా... నేనే పరమ గతి అని నమ్మి, సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి, ఇంద్రియ విషయములపట్ల ఆసక్తిని త్యజించి, సమస్త ప్రాణులయందు వైరభావము లేని భక్తుడే నన్ను పొందును." అంటాడు. ఈ మార్గం లో ప్రయాణించి పరమాత్మను పొందవచ్చు. ప్రతి మానవుడూ దీర్ఘ జీవితo కోసం కాక దివ్య జీవితం కోసం ప్రయత్నం చెయ్యాలి." అన్నారు భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త శ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి... శ్రీ శ్రీ శ్రీ విశ్వప్రసన్న తీర్థ శ్రీపాదుల వారి 35 వ చాతుర్మాస్య దీక్ష సందర్భం గా శ్రీ గంగాధర శాస్త్రి చే భగవద్గీతా ప్రవచనం ఏర్పాటు చేసారు. 'తండ్రి చేయిపట్టుకుని రోడ్డు దాటే పిల్లవాడికి భయం ఉండనట్టే... భగవద్గీత చదివి అర్ధం చేసుకుని ఆచరించేవాడిని అధైర్యం దరి చేరదని గంగాధర శాస్త్రి అన్నారు. భగవద్గీతను - జీవన గీత గా, నిష్కామ కర్మ గీత గా, భక్తి గీత గా, జ్ఞాన గీత గా, వ్యక్తిత్వ వికాస గీత గా, ధర్మ ప్రబోధ గీత గా, మానవీయ గీత గా ప్రచారం చేయవలసిఉందని, ఇది బాల్య దశనుండే అధ్యయనo చేయవలసిన గ్రంథం అన్నారు. ప్రతి ఒక్కరూ మితాహారాన్ని, సాత్వికాహారాన్ని, న్యాయార్జితాహారాన్ని, దైవార్పితాహారాన్ని భుజించాలని భగవద్గీత చెబుతుందన్నారు. 'భగవద్గీతను అర్ధం చేసుకుంటూ చదవండి. ఆచరించే లక్ష్యంతో అర్ధం చేసుకోండి..' అని పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలం లో భగవద్గీత పుస్తకం చదివి అర్ధం చేసుకునే తీరిక లేకపోవడం వల్లనే భగవద్గీతా ఫౌండేషన్ సంగీత భరిత భగవద్గీతను రూపొందించిందని, దీనిని ప్రజలు సద్వినియోగo చేసుకోవాలని సూచించారు. ఇంకా ఇంగ్లిష్, హిందీ, గుజరాతి, కన్నడ, తమిళ్, మలయాళం, ఒడియా, జర్మనీ, రష్యన్ భాషలలోకి కూడా విడుదల చేసేoదుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇందుకు దాతల నుండి చేయూతను అర్ధిస్తున్నామని గంగాధర శాస్త్రి కోరారు. అనంతరం శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామి- భగవద్గీత ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన చరితార్థుడు శ్రీ గంగాధర శాస్త్రి అని అభినందిస్తూ, భగవద్గీతా ఫౌండేషన్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత - తమ గురుదేవులైన శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ తీర్థ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
.